Thursday, December 31, 2009

అప్పుడే వెళ్ళిపోతున్నావా????


వెళ్ళిపోతున్నావా 2009??

కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోకముందే...
ఆర్థిక సంక్షోభానికి బలైన ఎందరో ఉద్యొగులు ఇంకా తేరుకోక ముందే...
తీవ్రవాదుల మారణహోమపు ఛాయలు ఇంక కనుమరుగవకముందే...
త్వరలో ప్రపంచం అంతమవబోతుందన్న వార్తల్లో నిజం నిర్దారణ కాకముందే..
భారత క్రికెత్ జట్టు ప్రపంచాగ్ర శ్రేణి జట్టుగా నిలిచిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే...
కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిథులు ప్రజల సమస్యల గురించి ఆలోచించడం ప్రారంభించకముందే...
ప్రజలు ప్రారంభించిన ఉద్యమాలు అర్ద్థవంతంగా ముగియకముందే...

అప్పుడే వెళ్ళిపోతున్నావా????
వెళ్తూ వెళ్తూ ఆ రాబొతున్న 2010 కి కాస్త చెప్పమ్మా..

కాలం కార్చిచ్చు రగిల్చిన మంటల్లో కాలి మసైన స్వప్న సౌధాల బూడిద రాసుల్లో
కొత్త కలల పునాదులు నిర్మించే కొందరు ఆశావాదులు....
ఎన్ని ప్రయత్నాలు విఫలమౌతున్నా కొత్త సంవత్సరం కొత్త విజయాలని మోసుకొస్తుందని
ఆశగా ఎదురు చుసే కొందరు అపర భగీరథులు...
జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా ఓర్చుకుంటూ రాబోయే కాలం నేర్పే కొత్త పాఠాల
కోసం ఎప్పటికప్పుడు ముస్తాబయ్యే కొందరు నిత్య యువకులు...
తనకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని....

ఇప్పటికే చాలా ఆలస్యమైంది..
2010కి స్వాగతం పలుకుతూ ఇంక జాగ్రత్తగా వెళ్ళు...

Monday, December 28, 2009

ఇంకెన్నాళ్ళు ప్రజలకు ఈ పరాజయం??


ప్రతి సారి ఎన్నికల కోలాహలం... కొత్త వాగ్దానాల ప్రవాహం...
నాయకులు మారినప్పుడల్లా ఏదో మార్పు వస్తుందని పిచ్చి నమ్మకం...
కొండంత ఆశతో ఎదురు చూసి విసిగిపోయి నిట్టూర్చడం...
ఎండ మావుల్లా కవ్వించే పథకాలెన్నో... మనకెప్పుడూ ఒక ఎన్నికల దూరం...
అన్ని వనరులు మన దగ్గరే ఉన్నా.. అందని ద్రాక్షలా ఊరించే వైనం..
అందరి జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందం...
మార్పు కోసం తిరగబడ్డ ప్రతిసారి తప్పని ఆశాభంగం...

ఎవరో వస్తారని ఎదో చేస్తారని నమ్మి.. నమ్మిన ప్రతిసారి మోసపోయిన అందరి మనసుల్లొ అసహనం...
మన బతుకులను మనమే మార్చుకుందాం...
మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుందాం...
అంటూ మొదలైన ఉద్యమం...


గ్లోబలైజేషన్ పుణ్యంతో దేశ దేశాలు తిరిగే ఉద్యోగాలు చేస్తున్న నీకు నాకు...
ఇదంతా వేర్పాటు వాదం... పిచ్చితనం.. ప్రాంతీయతత్వం.... అభివృద్దికి ఆటంకం...

రెక్కాడితే కానీ డొక్కాడని జనాలకి.. ఇది జీవన్మరణ పోరాటం..
జీవితాలని మార్చుకోవాలని ఏదో ఆరాటం....
కానీ, పూటకో వేషం మార్చే పగటి వేషపు నాయకులకు...
రోజుకో రంగు మార్చే సిగ్గు మాలిన రాజకీయాలకు...
ప్రజల బతుకులతో చెలగాటమే ఒక వినోదం...
రాజీనామాల దాగుడుమూతలాటలు.. నిరాహారదీక్షల ఆటవిడుపులు...

ఏ నిరాహార దీక్ష కరిగించగలదు వీరి అవినీతి కొవ్వు???
ఏ రాజీనామా చెల్లించగలదు వీరి నిర్లక్ష్యపు ఖరీదు???

కళ్ళెదురుగా ఇన్ని ప్రాంతీయ అసమానతలు కనబడుతుంటే..
బలవంతంగా ఎందుకు పాడిస్తున్నారు శృతి లేని సమైక్య రాగం??

ఎవరూ గ్రహించరెందుకు ఈ సత్యం??
ప్రజల మధ్య కాదు ఈ పోరాటం!!

అవకాశవాద రాజకీయాలు అంతమైన రోజున...
అందరికీ సమన్యాయం జరిగిన రోజున... అందరు ఆశించిన మార్పు వచ్చిన రోజున...
ఎవ్వరు గొంతు చించుకోనవసరం లేదు సమైక్యత కోసం...
అందరి మనసుల్లో వినిపిస్తుంది ఆ రాగం...