Monday, December 31, 2007

వీడ్కోలు - 2007


ఎలా వచ్చావ్?
ఎలా వెళ్ళిపోతున్నావ్?

ఎన్ని కలలు... ఎన్ని కన్నీళ్ళు...
ఎన్ని ఆశలు... ఎన్ని ఆశాభంగాలు...
ఎన్ని ప్రయత్నాలు... ఎన్ని ఎదురుదెబ్బలు...

ఎన్ని మధుర స్మృథులు...
ఎన్ని చేదు జ్ఞాపకాలు...

నిన్ను నిలదీయాలనుకున్నాను...
ఆశలతో మొదలుపెట్టినపుడు అశాభంగానికి సిధ్ధంగా వుండమని చెప్పనందుకు...
కలలెన్నో చూపిస్తున్నపుడు కన్నీళ్ళు కూడా వుంటాయని గుర్తు చేయనందుకు...

కానీ ఇప్పుడు నీకు కృతజ్ఞతలు చెప్పాలని వుంది...
ఆశాభంగాలను ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసం అవసరమని...
అప్పుడప్పుడు కలిగే కన్నీళ్ళే కలలను నిజం చేసే స్ఫూర్తిని కలిగిస్తాయని...
చెప్పకనే చెప్పినందుకు...

ఎన్నో విశేషాలకు మౌన సాక్ష్యంగా నిలచి...
మరెన్నో జ్ఞాపకాలను మాకు మిగిల్చి...
ఎంత ఆర్భాటంగా వచ్చావో...
అంతే భారంగా నిష్క్రమిస్తున్న నీకు...
అందరి తరపున కృతజ్ఞతా సుమాంజలి!!!!

Friday, December 14, 2007

!! స్వాతి చినుకులు !!

చిరునవ్వుల చుక్కలు కలిపి....
చిలిపితనపు రంగులు అద్ది...
నా మనసు వాకిట వెలసిన ముత్యాల ముగ్గు !!!


తొలి చూపుల పునాదులపై...
చెలి ఊహల సోపానాలతో...
నా హృదయ ప్రాంగణంలో నిలిచిన ప్రేమ సౌధం!!!


వలపు ఆకాశంలో...
తలపుల మేఘాలు ఢీకొని...
కురిసింది ప్రేమ జల్లు...
తడిసాయి రెండు మనసులు...
విరిసింది రెండు హృదయాలను కలిపే హరివిల్లు!!!

భాషకు భావుకతని అరువిచ్చే భావాలెన్నో..
నీ చూపుల్లో ఉండగా....
నిన్ను చూస్తూ నేను పలికే ప్రతి మాట ఓ కవితే కదా!!!

నీతో కలిసి ఉన్న వేళ...
ఆకలేమో "ఇప్పుడు నేనెందుకు గుర్తొస్తాను నీకు?"
అని అలిగి వెళ్ళిపోయింది...
నిద్రేమో "ఇంక నా అవసరం ఏముందిలే నీకు?"
అని అసూయతో జారుకుంది...
నిన్నే తనలో నింపుకున్న నా మనసేమో ..
వాటిని చూసి విజయ గర్వంతో చిరునవ్వు నవ్వింది!!!


కలలను ప్రేమిస్తున్నాను..
జీవితపు అందాలను చూపిస్తున్నందుకు...
కన్నీళ్ళను కూడా ప్రేమిస్తున్నాను..
జీవితపు లోతుల్ని పరిచయం చేస్తున్నందుకు...


మన ప్రతి ఎడబాటు..
రెండు కలయికల మధ్య వారధి..
ఈ వారధిని ఎప్పుడెప్పుడు దాటేద్దామా..
అని ఆరాటపడే నా మది!!!


ఆకాశంలోకి చూసి చందమామ ఎక్కడని అడిగితే...
చుక్కలు నాతో చెప్పిన రహస్యం!!
అలకలోను అందంగా ఉండే నీ మోముని దొంగచాటుగా చూడాలని..
ఆ చిలిపి చంద్రుడు,వెన్నెల తేకుండా నిన్ను ఉడికిస్తూ..
మబ్బుల చాటున దాగాడంట!!!