Friday, August 24, 2007

Engg Life!


చేరిన కొత్తలో కనిపించిన కొత్త ముఖాలు...
భయంతో కూడిన బెదురు చూపులు...
ర్యాగింగ్ భయంతో సీనియర్లని తప్పించుకోవడానికి పడిన పాట్లు...
ఖర్మకాలి సీనియర్లకి దొరికినప్పుడు పాడిన పాటలు... వేసిన స్టెప్పులు...

మా ప్రతీకారం చుపించుకోవడానికి మాకు దొరికిన జూనియర్లు...
వారితో వేయించిన వేషాలు... రాయించిన అసైన్ మెంట్లు...
ఆర్టీసి బస్సుల్లో హంగామా...
బస్సు స్టాపుల్లో ర్యాగింగ్ హైడ్రామా....

క్యాంటీన్ లో కబుర్లు... లాన్ లో ముచ్చట్లు...
అమ్మాయిలపై కామెంట్లు... లెక్చరర్లపై సెటైర్లు...
అందరు కలసి క్లాసులకి కొట్టిన ఢుమ్మాలు...
ప్రిన్సిపాల్ తో తిన్న చీవాట్లు....
మార్కుల కోసం చేసిన చిత్ర విచిత్ర ప్రయత్నాలు...
అటెండెన్స్ కోసం పడిన అగచాట్లు...

పరీక్షల సమయాల్లో గడిపిన నిద్ర లేని రాత్రులు...
అర్ధరాత్రి టీలు... సబ్జెక్టు పై చర్చలు...

హోటల్లో విందులు... డిస్కోలో చిందులు...
అబ్బాయిల కొంటె సైగలు... అమ్మాయిల ఓర చూపులు...

అందరి దారులు వేరవుతున్న ఆఖరి రోజులలో....
చెప్పలేని భావాలు... బరువెక్కిన గుండెలు...
మూగబోయిన మనసులు...

నా ఆశ!

నీ ఆశల హరివిల్లు లోని ప్రతి రంగుని నేనై వెలిగిపోవాలని...

నీ కలల పుస్తకపు ప్రతి పేజిలో ఒక చెరిగిపోని సంతకం నేనై మిగిలిపోవాలని...

అందమైన నీ ఊహల చిరుజల్లులో ప్రతి చినుకుని నేనై మురిసిపోవాలని...

నీ మాటల పూదోటలో విరిబాలనై వికసించాలని...

నీ ఆలోచనా ప్రవాహంలో ఎగసిపడే ప్రతీ అలని నేనైపోవాలని....


అశయసాధనలో నువ్వు వేసే ప్రతి అడుగుని నేనై...

గెలుపు కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నపు స్ఫూర్తిని నేనై...

ఓటమిలో నిను ఓదార్చి ముందుకు నడిపే కొత్త ఊపిరిని నేనై...

పరిస్థితులపై పోరాటంలో నీ శక్తిని, యుక్తిని నేనైపోవాలని...

నీ జీవననౌకకి చుక్కానినైపోవాలని...


సిగ్గులో నీ నునులేత బుగ్గలపై ఎరుపుని నేనై...

ఆశ్చర్యంలో నీ మోముపై నిలిచే అమాయకత్వం నేనై...

ఉల్లాసంలో నీ చూపులో మెరిసే చిలిపితనం నేనై...

ఉద్వేగంలో నీ గుండె చప్పుడు నేనై...

ఆనందంలో నీ పెదాలపై విరిసే చిరునవ్వుని నేనై...

ఆవేదనలో నీ కంటి నుండి జారే కన్నీటి చుక్కని నేనైపొవాలని...

నీ భావావేశాల్లో నేనొక భాగమైపోవాలని...


నువ్వే నేనైపోవాలని...

నేనే నువ్వైపోవాలని...

మనిద్దరం ఒకటవ్వాలని... నా ఆశ!!!

మన ఉదయం!

ఎప్పటిలాగే ఇంకో ఉదయం...
మళ్ళీ మొదలయింది పరుగు పందెం...
మనతో పోటీకి సిధ్ధమైంది గడియారం....

నా మనసుకు నాపై కోపం!

నువ్వు నాకు పరిచయమైన తరవాత....

గడుస్తున్న కాలంతో పాటు
నీపై పెరుగుతున్న ఇష్టం గురించి...

నీ ఆలోచనలతోనే ప్రారంభమై...
నీ ఆలోచనలతోనే పూర్తయ్యే...
నా దినచర్య గురించి...

నీక్కూడా తెలియకుండా
నువ్వు నాలో కలిగిస్తున్న అలజడి గురించి....

ఎందరి మధ్యన ఉన్నా
ఎప్పుడూ నన్ను అల్లరి పెట్టే
అందమైన నీ ఊహల గురించి...

ఎక్కడ ఉన్నా
నీకై వెతికే నా చూపుల గురించి....

ఎంత దూరాన ఉన్నా
నిన్ను నా మది ముంగిట్లో నిలిపే
నా కలల గురించి...

ఎప్పుడూ నీ ఆనందానికై
ఆరాటపడే నా మనసు గురించి...

నేనున్నానన్న సంగతి కూడా మరచిపోయి
నీ కోసమే పరితపిస్తున్న
నా హృదయం గురించి...

ఇలా ఎన్నో భావాల గురించి...
నీకు వివరించడానికి...
కేవలం రెండక్షరాల "ప్రేమ" అనే పదం వాడినందుకు
నా మనసుకు నాపై కోపం...
ఎందుకంటే తనకు మాత్రమే తెలుసు...
నేను నీకై పడే ఆరాటం!!

చేదు నిజం!


'మన అనుబంధాలన్నీ ఆప్యాయతానురాగాల పునాదులపై నిర్మించిన భవంతులు....'
అన్న నా అందమైన నమ్మకం రోజురోజుకీ అడుగంటిపోతుంటే...

'మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే' అన్న వాదనతొ ఏకీభవించని నాకు
దానిని నిరూపించడానికి అధారాలు కరవైపొతుంటే...

అయినవారి మధ్య అనుబంధాలకి లెక్కలు కట్టలేని నా అఙ్ఞాన హృదయం
అనుబంధాలకి అతీతంగా డబ్బుతో సంతొషాన్ని కొనుక్కోవాలనుకునే
మేథావుల విఙ్ఞానం ముందు నిలవలేక తల్లడిల్లిపోతుంటే...

మనుషుల్లో మంచీ చెడు పసిగట్టలేకపోయిన నా స్వఛ్ఛమైన బాల్యం...
విభిన్న మనస్తత్వాలని విశ్లేషించలేకపోయిన నా బాల్యం...
అందరూ మంచివాళ్ళే... లోకమంతా అందమైనదే... అని
అమాయకంగా నమ్మిన నా బాల్యం ఒక్కసారిగా మదిలో మెదిలి...
ఆ భావాలన్నీ ఒక్కొక్కటిగా నా కన్నీటిలో కరిగి కనుమరుగైపోతుంటే...

కఠోరమైన వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే...
ఇది నిజమని నా మనసుని నమ్మించలేక...
అబద్దమని నిరూపించలేక...దీన్నుండి తప్పించుకుపోలేక...

ఈ విషయాలని తనలో ఎప్పుడు కలుపుకుంటుందా...
అనిఆశగా కాలం వైపు చూస్తూ నేను...

జీవితపు లోతుల్ని తరచిచూడమంటూ...
మానవ సంబంధాల మాయాజాలంలో మనసుని బలి పశువుని కానీకు...
అని హెచ్చరిస్తూ... భారంగా కదులుతున్న కాలం...

Wednesday, August 22, 2007

ఉగాదికి స్వాగతం!

ఒంటరిగా కూర్చొని ఉన్న నన్ను ఉగాది కాస్త ముందుగానే పలకరించింది...
దిగులు పడుతున్న నన్ను చూసి విషయం ఏంటని అడిగింది...

అంతా చెప్పాను నేస్తం...
నీ సమస్యలు.. నా సమస్యలు.. మనందరి సమస్యలు...
మన భాధలు.. బాదరబందీలు, భావావేశాలు....
అన్నిటిని విడమరిచి చెప్పాను నేస్తం!

ఆశయాల సాధనలో అయిన వాళ్ళందరికి దూరంగా
అహర్నిశలు శ్రమిస్తున్న ఒక మిత్రుడి గురించి చెప్పా!

ప్రతికూల పరిస్థితుల వలయం లో చిక్కుకొని
ఒక క్షణం అసహాయతతో ఢీలా పడుతూ..
మరు క్షణం అశావాదంతో ముందడుగు వేస్తూ..
నిరంతరం పోరాడుతున్న ఒక యువకుడి వ్యథ వినిపించా!

జీవితాన్ని కబళించి వేస్తున్న యాంత్రికత నుంచి
తన భావుకతని కాపాడుకోవడానికై
తాపత్రయపడుతున్నఒక భావుకుడి గురించి చెప్పా!

ఆశలు, ఆశయాల మధ్య జరుగుతున్న
అంతులేని సమరంలో సమిధగా మారుతున్న
ఒక మధ్య తరగతి విధ్యార్థి గురించి చెప్పా!

చదువులో అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది
పట్టభద్రుడైన ఒక అబ్బాయి...
ప్రేమ పరీక్షలో విఫలమై విలవిలలాడుతున్న వైనం వివరించా!

కట్టుబాట్లను కాదనలేక.. కావాల్సిన వాడిని ఎంచుకోలేక..
రాబోయేవాడు తన కలల రాకుమారుడేనా కాదా ?
అని కలవరపడుతున్న ఒక కన్నెపిల్ల కథ చెప్పా!

వ్యక్తిగత స్వేఛ్ఛని హరించి వేస్తున్న సంప్రదాయాలు..
ఉద్యోగ జీవితంలోని సవాళ్ళతో..
సతమతమైపోతున్నఈ తరం అమ్మాయి ఆవేదన నినదించా!

భాధపడకు నేస్తం!!
"మనలోని నిర్వేదపు చీకట్లను ప్రారద్రోలుతానని...
మన మనసుల్ని నవ చైతన్యంతో నింపుతానని...
జీవితంపై ఆసక్తిని...
భవిష్యత్తు పై ఆశని తనతో మోసుకొస్తానని అంటూ..
మన కలలు నిజం కావాలని కోరుకుంటూ..
మరి కొద్ది రోజుల్లో మన ముందుకొస్తానని చెప్పింది ఉగాది"

ఇదే నేస్తం...
రాక ముందే ఉగాది నాకు చెప్పిన రహస్యం...
మర్చిపోకుండా పలుకుతావు కదా తనకి స్వాగతం....

ఉగాది శుభాకాంక్షలతో!!!

నా ప్రయాణం!


జీవితమనే సాగరం లోని మార్పుల ప్రవాహంలో...
ఆశల గాలికి ఎదురీదుతూ…
నా ఆశయాల తీరం చేరుకోవడానికైచేస్తున్నాను ప్రయాణం…

అంతలో తీరం వైపుగా వెళుతూ కనిపించింది ఒక నౌక…
నా ప్రయత్నాలని కాసేపు ఆపి..నౌకలో చేరి విశ్రమించాను…
తీరం కనిపిస్తున్న ఆనందంలో నౌక వెళ్తున్న దారిని మరిచాను...

తీరా కళ్ళు తెరిచి చూసాక తెలిసింది…
ఇది కాదు నేను కలలు కన్న తీరం…
అడుగడుగునా ఎదురైంది ఆశా భంగం…

అయినా నా మనసుని నమ్మించడానికి చేసానొక విఫల యత్నం…
“వాస్తవమెప్పుడూ కలలకి చాలా దూరం…
ఇది నమ్మక తప్పని ఒక చేదు నిజం….”
అనుకుంటూ కాలం గడుపుతున్న నన్ను…

“కలలు నిజం కావడానికి కావాలి నీ ప్రయత్నం...
అలా కాని రోజున కలలు నిజమౌతాయనే మాటకి అర్ధమే శూన్యం..
ఇంకెన్నాళ్ళీ మోసం?”అని నిలదీసింది నా మనసు…

ఆ ప్రశ్నకి సమాధానంగా…
మళ్ళీ మొదలైంది నా ప్రయాణం…
కాలం నేర్పిన అనుభవంతో...
దారిని మరవనన్న నమ్మకంతో…
ఎప్పటికైనా నా కలల తీరం చేరుకోగలననే ఆశతో…

Tuesday, August 21, 2007

చెన్నై నగరం

వణక్కం అంటూ వందనం...
ఏ హోటల్ కెళ్ళినా అంతా సాంబారు మయం...
తమిళ్ తెలియక అయోమయం...
తెలుగు వాళ్ళని చూసినప్పుడు అంతా మన వాళ్ళేనని ఆనందం...
మురిపించే మెరీనా తీరం...
అడుగడుగునా ఐటీ కంపెనీల స్వాగతం...
ఇది చెన్నై నగరం...
అలా గడిచింది ఒక సంవత్సరం...

To CTS!!

CTS!! ఓ మంచి CTS!!

expect చేయకుండానే నాకు campus recruitment లో job ఇచ్చావ్…
వేరే ఏ company కి try చేయకుండా చేసావ్…
నా time waste కావడానికి joining date late గా ఇచ్చావ్….
ఎక్కడ place లేనట్టుగా చెన్నై లో posting ఇచ్చావ్….

నా ఆసక్తి ని చంపడానికి నాకు Mainframes technology ఇచ్చావ్…
నా career నాశనం కావడానికి నాకు production support project ఇచ్చావ్...
నాలో irritation పెంచడానికి ప్రతి విషయాన్ని joining date తో ముడి పెట్టావ్…
నా ఆసక్తి ని అందుకోవడానికి ప్రయత్నిచినందుకు నాకు 3rd bucket ఇచ్చావ్…

ఐనా నువ్వు నాకు నచ్చావ్…
ఎందుకంటే…
నాలో పట్టుదలని పెంచావ్…
నేను ఉండాల్సిన చోటు ఇది కాదని నాకు ప్రతి సారి గుర్తు చేస్తున్నావ్…
పరోక్షంగానైనా నాకు సహకరిస్తున్నావ్…..
అందుకే నువ్వు నాకు నచ్చావ్!!!!

With love...
An ELT from 2005 batch.

అంకితం: CTS లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి...

Monday, August 20, 2007

వర్షానికి ఒక లేఖ!


నా ఎదురుగా నువ్వు...
నిన్నే చూస్తూ నేను...
నా మనసులో ఉరుములు...
నీ చూపులో మెరుపులు...
వెరసి అపుడే మొదలైంది వర్షం....

చుట్టూ ప్రపంచాన్ని మరచిపోయి చిన్న పిల్లలా
ఆడుకుంటున్న నీ కళ్ళలోని ఆనందాన్ని నాకు చూపించిన వర్షం...

నువ్వు నా ఎదురుగా ఉంటే ప్రత్యేకంగా అనిపించే వాతావరణాన్ని
తన రాకతో మరింత రమణీయంగా మార్చిన వర్షం...

ఆకాశం లోని ఆ ఇంధ్రధనుస్సుని
నా కళ్ళముందే నిలిపిన వర్షం...

కురిసే ప్రతి వర్షపు చిరుజల్లు
ఆనందపు జడివానగా మారి మన మనసుల్ని ముంచెత్తాలని...
మన ఆనందం లో తను ఎప్పుడూ ఒక భాగం కావాలని...
వర్షానికి ఒక లేఖ!!!

నిన్ను చూడాలని...

నువ్వు ఎదురుగా ఉన్నపుడు ...
కను రెప్పలు వేయడం మరిచిపోయాను...
నిన్ను చూసే సమయం లొ ఎక్కడ కొన్ని క్షణాలు కోల్పోతానేమోనని...
నువ్వు ఎదురుగా లేనప్పుడు...
కళ్ళు తెరవడం మరిచిపోయాను...
కలలో నుండి నీ రూపం ఎక్కడ కనుమరుగైపోతుందేమోనని..

Wednesday, August 15, 2007

చెన్నపట్నం పై పోరాటం... భాగ్యనగరంకై ఆరాటం...

వచ్చారు ఛెన్నై నగరం…
మొదట్లో అందరి లోను వురకలు వేసింది ఉత్సాహం…
అలా గడిపారు ఒక సంవత్సర కాలం...

ఇంతలో వీరిని పిలిచింది భాగ్య నగరం…
తరవాత మొదలైంది అందరి మదిలో కలవరం…
అందరిలోను ఎప్పుడు వెళదామా అని ఒకటే ఆరాటం…

చేస్తున్నారు వాళ్ళ PMలతో పోరాటం...
ఎవరెవరికి దక్కుతుందో విజయం…
ఎప్పుడు అవుతాయో వారి కలలు సాకారం…
కాలమే చెప్పాలి దీనికి సమాధానం……

అంకితం...... CTS చెన్నై నుండి హైదరాబాద్ Transfer కోసం ప్రయత్నిస్తున్న మిత్రులందరికీ.....

Tuesday, August 14, 2007

నీ ప్రేమకై... నా ప్రయాణం...


నా ఆశకి ఊపిరి పోసి...
నా ఊహలకి రెక్కలు తొడిగి...
నా కలలకి రంగులు పూసి..
నా ఆలోచనలకి అందం తెచ్చి...
నా మనసుకి కొత్త భాష్యం చెప్పి...
నా ప్రేమకి ప్రాణం పోసి..
నా జీవన గమ్యంగా నిలిచిన నిన్ను చేరుకోవడానికై..
కాలం రహదారిలో నా ప్రయాణం...
ప్రేమే నా వాహనం...
ఆశే నా ఇంధనం!!!

నా నువ్వు...

కనులు మూస్తే రెప్పల మాటున నువ్వు...
కనులు తెరిస్తే నా గుండెల మాటున నువ్వు...

మాటలాడుతున్నపుడు నా మనసు మూలల్లో నువ్వు...
మాటలు కరవైనపుడు నా మౌనం లో నువ్వు...

నా ప్రతి కలలోను నువ్వు...
నా ప్రతి ఊహలోను నువ్వు...

నా ఆశల ఊపిరి నువ్వు...
నా ఆశయాల అర్థం నువ్వు...
నా కలల తీరం నువ్వు...

చెరిగిపోని స్నేహానికి చిరునామా నువ్వు...
అంతులేని ప్రేమకి నిర్వచనం నువ్వు...

Farewell...

4 సంవత్సరాల ఈ ఇంజనీరింగ్ జీవితం...
ఓ మరపు రాని జ్ఞాపకంగా మిగిలిపోతున్న తరుణాన...
ఈ కాలేజి మిగిల్చిన మధురస్మౄథులు...
మనసుని భారంగా చేసేస్తోన్న ఈ సమయాన...

జీవితం లోని ఇంత అందమైన అధ్యాయం అప్పుడే ముగిసిపోయిందా...
అని మూగబోతున్న నా మనసుకి...
భవిష్యత్తు ఇంకా అందమైనదనే వాస్తవాన్ని తెలియచెప్పి...
అందమైన ఆ భవిష్యత్తు వైపుగా ముందడుగు వేస్తున్న ఈ క్షణాన...

దేశాన్ని ముందుకి నడిపేది మేమేనన్న ధీమాతో అడుగులు వేసే మీరు నాకిక కనిపించరా?
అని మా కాలేజి క్యాంపస్ దిగులు పడింది...

ప్రతి క్లాసు లోను వెనుక బెంచీ లొ కూర్చొని మీరు చేసే అల్లరి నేనిక చూడలేనా?
అని మా క్లాస్ రూము చిన్నబోయింది...

ప్రతి సెమిస్టర్ ప్రారంభంలో పుస్తకాల కోసం మీరు చేసె దండయాత్రలు ఇక వుండబోవా?
అని మా కాలేజి లైబ్రరీ మౌనం వహించింది...

క్లాసు ల కన్నా ఎక్కువగా హాజరవుతూ కాలేజి విషయాలపై
మీరు జరిపే రౌండు టేబుల్ కాంఫరెన్సులకి ఇక ఆతిథ్యం ఇవ్వలేనా?
అని మా కాలేజి లాన్ మథనపడింది...

అందరు కలసి కూర్చుని అమ్మాయిలపై చేసే కామెంట్లని
లెక్చరర్ల పై వేసే జోకులని నేనిక వినలేనా?
అని మా కాలేజి క్యాంటీన్ మూగబోయింది...

మా కాలేజి క్యాంపస్, క్లాస్ రూం, లైబ్రరీ, లాన్, క్యాంటీన్
ఇలా ఒక్కటొక్కటే మా నిష్క్రమణని చూసి భాధ పడ్డాయి...
అంత లోనే ప్రతి సంవత్సరం మాకిది మామూలేనని నిట్టూర్చాయి...
మా బంగారు భవిష్యత్తుకి శుభాకాంక్షలు తెలిపాయి...
భారంగా మాకు వీడ్కొలు పలికాయి...

తొలి కవిత...

ప్రతి రోజు నీ ఆలోచనలతోనే అవుతుంది నాకు శుభోదయం...
నేను చేసే ప్రతి పని లోను నన్ను వెన్నంటే వుంటుంది.... నీ ఆలోచనల సాంగత్యం....
నిరంతరం నా మనసంతా నిండి వుంటుంది... నీ నవ్వు లోని మాధుర్యం...
అనుక్షణం నన్ను వెంటాడుతుంది... అందమైన నీ మోము లోని అమాయకత్వం...
నా కంటి మీదకి కునుకు రానివ్వడం లేదు... నీ కళ్ళలోని చిలిపితనం...
నా జీవన నౌకని ముంచెత్తింది... నీ ఆలోచనా ప్రవాహం....

మనసు ఆకాశం లో...

నీ ఊహల నక్షత్రాలే...
నా మనసు ఆకాశం నిండా...
నిండు చందమామలా నువ్వు...
పండు వెన్నెలలా నీ ప్రేమ....