Thursday, August 30, 2018

ఇప్పటికైనా మేల్కొంటావా??

దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ఎప్పుడైనా విన్నావా??
లేక దేశం పేరు వినగానే శివాలెత్తి ఊగిపోవడమే దేశభక్తి అనుకుంటున్నావా?

దేశం నడుస్తున్న తీరు గమనించే తీరిక చేసుకుంటున్నావా?
లేక కేవలం పంద్రాగస్టుకి చబ్బీస్ జనవరికి జెండాని  ప్రొఫైల్ ఫోటోలా పెట్టుకుని మురిసిపోతున్నావా??

దేశంలోని సిధ్ధాంతాలని భావజాలాన్ని అర్ధం చేసుకుంటున్నావా?
లేక పార్టీల గుర్తులు, జెండాల మాయలో పడి కొట్టుకుపోతున్నావా??

మనిషి గురించి ముందు ఆలోచిస్తున్నావా?
లేక నీ మతమే గొప్పదని బీరాలు పోతున్నావా??

ప్రపంచీకరణ నేర్పిన జ్ఞానాన్ని స్వీకరిస్తున్నావా?
లేక నీ పాత చింతకాయ పచ్చడి భావాల్లోనే మగ్గిపోతున్నావా??

విభిన్న అభిప్రాయాలని గౌరవిస్తున్నావా?
లేక సంస్కృతి సంప్రదాయాల ముసుగులో వ్యక్తి గత స్వేచ్ఛని కాలరాస్తున్నావా??

బతుకు బతకనివ్వు అంటూ భాద్యత గల పౌరుడిగా మసలుతున్నావా?
లేక నా కులం నా మతం నా ప్రాంతం అనే సాకుతో నీకు నచ్చని ప్రతి దానిపై రాధ్ధాంతం చేస్తున్నావా??

చరిత్ర చెప్పిన పాఠాలు నేర్చుకుంటున్నావా?
లేక ఛాందస భావాలతో మళ్ళీ అవే తప్పులకు  పునాదులు వేస్తున్నావా??

పౌరుడిగా నీ హక్కుల కోసం ప్రశ్నిస్తున్నావా?
లేక పార్టీల ప్రాపగాండా ఉచ్చులో పడి నీ ప్రాథమిక హక్కులనే మరుస్తున్నావా??

ప్రజాస్వామ్య విలువల గొప్పదనం తలకెక్కించుకుంటున్నావా?
లేక నియంతృత్వ పోకడలున్న నేతలనే నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నావా??

రాజ్యాంగ విలువలపై అవగాహన తెచ్చుకుంటున్నావా?
లేక నాయకుల మాటల్లోనే వాటి నిర్వచనాలు వెతుక్కుంటున్నావా??

ప్రశ్నించే తత్వం అలవర్చుకుంటున్నావా?
లేక ప్రశ్నించే ప్రతి వాడిని దేశద్రోహి అంటూ రంకెలేస్తున్నావా??

ఇప్పటికైనా మేల్కొంటావా.. మార్పులో భాగమౌతావా?
లేక ఇలా మరమనిషిలాగే కాలగర్భంలో కలసిపోతావా??

Wednesday, August 29, 2018

గతించిన క్షణాలు!!

కాల చక్రం కింద నిర్దాక్షిణ్యంగా నలిగిపోయిన క్షణాలెన్నో
ఈ రోజు నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి..
చూస్తుండగానే చేజారిపోయిన క్షణాలు కొన్ని..
ఎదురుగా ఉండి ఆహ్వానించినా గుర్తించలేక గడిచిపోయిన క్షణాలు ఇంకొన్ని..
ఉరుకులు పరుగుల యాంత్రిక జీవన ప్రవాహంలో పడి కొట్టుకుపోయిన క్షణాలు కొన్ని..
జీవన ప్రాథమ్యాల్ని అవగతం చేసుకునే క్రమంలో అందుకోలేకపోయిన క్షణాలు ఇంకొన్ని..
కలలు చెదిరిపోయి మిగిల్చిన కన్నీళ్లలో కరిగిపోయిన క్షణాలు కొన్ని..
మనసుకు తగిలిన గాయాలు మానేలోపు మాయమైపోయిన క్షణాలు మరికొన్ని..
గతించిన కాలపు జ్ఞాపకాల జడిలో కొట్టుకుపోతూ
గడిచిపోయిన క్షణాలని
ఎన్నటికీ మార్చలేను...
మొత్తం మరువలేను..
ఇంకోలా గడపలేను..
పూర్తిగా చేరిపేయలేను..
అని తల్లడిల్లిపోతున్న నన్ను
ఓదార్చింది కాలం
అవేవి నువ్వు చేయలేవు
కానీ ఒక్కసారి గతాన్ని అంగీకరించు..
ఆ క్షణాలన్ని జీవితంలో ఒక భాగమని గుర్తించు..
కాల ప్రవాహంలో ఆటుపోట్లు సహజమని గ్రహించు..
ఆప్పుడు గడిచిపోయిన క్షణాలు
నీకు ఎప్పటికి తోడుండే నేస్తాలు..
కొన్ని క్షణాలు అందమైన జ్ఞాపకాలు..
మరికొన్ని క్షణాలు కాలం నేర్పిన కఠిన పాఠాలు..
రాబోతున్న కాలాన్ని ఒడిసిపట్టేందుకు సోపానాలు..
అంటూ నూరిపోసింది ధైర్యం..
భవిష్యత్ వైపు చూపింది అద్దం..
నా మనసుకు మరో ఉషోదయం..
ఎంతో విలువైనది జీవితం..
మంచి మార్పుకి ఎప్పుడైనా పలకొచ్చు స్వాగతం..
జీవితాన్ని ప్రేమిస్తే ఎప్పుడూ మనకి తోడుంటుంది కాలం..
ప్రతి క్షణం ఆస్వాదించొచ్చు అందమైన ఈ ప్రయాణం..