Monday, March 28, 2011

జ్ఞాపకాలు!!!


జ్ఞాపకాలు... మళ్ళీ మళ్ళీ అవే జ్ఞాపకాలు...
ఎంతమంది మధ్యలో ఉన్నా నన్ను ఒంటరిని చేసే నీ జ్ఞాపకాలు....

స్నేహితులతో కలిసి సముద్ర తీరాన కూర్చున్నాను...
"చెన్నై మెరీనా తీరంలో నా అడుగుల్లో అడుగులు వేస్తూ,
నువ్వు నా వెనకే నడిచిన జ్ఞాపకం"...
బలంగా వచ్చి తాకిన అల నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు అలలతో ఆడుతున్నారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!

సాయంత్రం పూట గుడికి వెళ్ళాను...
"ఒకరోజు గుడిలో చేతిలో చెయ్యేసి ఇద్దరం కలిసి గంట కొడుతుంటే,
అక్కడున్న పిల్లలు మనల్ని ఆసక్తిగా చూసిన జ్ఞాపకం".....
గట్టిగా మోగిన గుడి గంట నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు భక్తి పారవశ్యం లో మునిగిపోయి ఉన్నారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!!

వర్షంలో తడుస్తూ ఇంటికి వెళ్తున్నాను...
"ఒకరోజు వర్షంలో నేను చేసిచ్చిన కాగితపు పడవని నీళ్ళల్లో వదిలి
నువ్వు నా వైపు మెచ్చుకోలుగా చూసి నవ్విన జ్ఞాపకం".....
ఎక్కడో దూరంగా ఉరిమిన శబ్దం నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు గొడుగులతో హడావిడిగా నడుస్తున్నారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!!

బస్ స్టాప్ లో నిలబడి వేచి చూస్తున్నాను...
"ఒకరోజు రన్నింగ్ బస్ నుండి దిగినందుకు,
నువ్వు నాకు ఆగకుండా చీవాట్లు పెట్టిన జ్ఞాపకం".....
గట్టిగా వినిపించిన బస్ హారన్ నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు బస్ దగ్గర క్యూ కట్టారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!!

ఆఫీస్ లో కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసుకుంటున్నాను...
"ఒకరోజు అంతా నిశ్శబ్దంగా ఉన్న ఆఫీస్ లో,
'అంతేనా?' అంటూ అందరికీ బొమ్మరిల్లు రింగ్ టోన్ వినిపించిన నీ ఫోన్ కాల్ జ్ఞాపకం".....
చెవులు చిల్లులు పడేలా మోగిన ఆఫీస్ ఫోన్ నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు పనిలో మునిగిపోయి ఉన్నారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!!

సినిమా హాలులో కూర్చుని ఉన్నాను..
"మొదటి సారి 3D సినిమా చూస్తూ నువ్వు గాల్లో చేతులు పెట్టి,
ఏదో అందుకోవాలని ప్రయత్నిస్తూ చిన్నపిల్లలా ఆనందించిన జ్ఞాపకం".....
DTS లో గట్టిగా వినిపించిన శబ్దం నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు సినిమాలో లీనమై ఉన్నారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!!

ఈ సారి నీ పుట్టిన రోజుకి అందరికన్నా ముందుగా శుభాకాంక్షలు చెప్పాలని
ఆతృతగా నీ నంబర్ కి డయల్ చేస్తున్నాను....
"ఒకసారి నీ పుట్టినరోజుకి ' అందరి కన్నా ముందు నువ్వే నాకు విషెస్ చెప్పాలి,
అంతవరకు నేను ఎవరితో మాట్లాడను ' అని నువ్వు ఆజ్ఞాపించిన జ్ఞాపకం".....
"The subscriber you are trying to reach is currently not answering your call. Please try after some time"
అని వినిపించిన మెసేజ్ నన్ను ఈ లోకం లో పడేసింది.
నేనొక్కడినే ఒంటరిగా మిగిలిపోయాను!!!

నా ఒంటరితనాన్ని చూసి ఒక్కసారిగా మళ్ళీ
రెక్కలు కట్టుకుని వచ్చి నన్ను చుట్టు ముట్టాయి జ్ఞాపకాలు...
ఇప్పుడు అవే నాకు ఆప్తమిత్రులు...
అవి నన్ను ఓదార్చుతున్నాయో... లేక వేధిస్తున్నాయో...
తెలియకుండానే బలపడిపోయింది మా స్నేహం...

ఎప్పటికైనా ఈ జ్ఞాపకాలని నీతో కలసి పంచుకుంటానా?
లేక ఈ జ్ఞాపకాలతో నేనొక్కడినే ఒంటరిగా మిగిలిపోతానా?