Monday, September 1, 2008

ఉపాధ్యాయ లోకానికి, విధ్యార్థి మిత్రులకు ఓ లేఖ!!(సెప్టెంబరు 5)


పాఠశాలని వారికి మరో ఇంటిగా మార్చగల సామర్థ్యం మీది..
అమ్మా నాన్నల తర్వాత అంతటి ఆప్తుడిగా మీరుండాలనే ఆరాటం వారిది!!

తప్పు చేస్తే మరుమాట్లాడక దండించగల అధికారం మీది..
మీరేం చెప్పినా తమ మంచికేనన్న నమ్మకం వారిది!!

ఒక్క చిన్ని హృదయం గాయపడినా తల్లడిల్లిపోయే మమకారం మీది..
మీరిచ్చే ధైర్యంతో కష్టాలతో పొరాడాలనే తాపత్రయం వారిది!!

వారి ప్రతి చిన్న గెలుపుని మీ గెలుపుగా ఆస్వాదిస్తూ అందించే ప్రోత్సాహం మీది..
మీరిచ్చే చిన్ని ప్రశంసతో మరిన్ని విజయాలకై కృషి చేసే ఉత్సాహం వారిది!!

ఓటమిలో ఓదార్చి, గెలుపు వైపు అడుగులు వేయించగల భరోసా మీది..
మీ సహకారంతో తమ స్వప్నాలు సాకారం చేసుకోగల సత్తా వారిది!!

ఎందరో మహనీయుల జీవితాలలో చెరగని ముద్ర వేసిన ఘనత మీది..
మీ దిశానిర్దేశనంలో అద్భుతాలు సృష్టించిన చరిత వారిది!!

మీరు గర్వించే స్థాయికి ఎదిగిన వారిని చూసినపుడు వెలకట్ట లేని ఆనందం మీ కళ్ళల్లో..
తమని జీవితంలో గెలిపించిన మీ మార్గదర్శకత్వానికి తీర్చుకోలేని కృతఙ్నత వారి మనసుల్లో!!

ఈ క్షణాన..
మీ భోదనలొ ఎదిగిన విధ్యార్థులెందరో మీ ఙ్నాపకాల్లో..
జీవితంలో ఎన్నటికి మరువలేని గురువులెందరో వారి మనసుల్లో..
గురు శిష్య బంధం చిరస్మరణీయం మన జీవితాలలో!!

Wednesday, August 13, 2008

మాయాజాలం!!


ఎంత కఠినమైనది ఈ కాలం!!!
నీకు దూరంగా ఉన్నప్పుడు...
కాస్త వేగంగా పరిగెత్తమని, నా నిరీక్షణకి తెర దించమని...
తనను ఎంతలా వేడుకుంటానో??

కానీ నా ఆరాటాన్ని కాస్తైనా అర్థం చేసుకోని కాలం..
క్షణాలని గడియలుగా పొడిగిస్తూ... సమయాన్ని సాగదీస్తూ..
వయ్యారాలు ఒలికిస్తూ... నెమ్మదిగా నడుస్తుంది!
ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అని..నా మనసు పడే ఆరాటం తనకు కనిపించదా??

ఎంత నిర్దాక్షిణ్యమైనది ఈ కాలం??
నీతో కలిసి ఉన్న సమయాన...
అదే వయ్యారంతో నెమ్మదిగా నడవమని... కాసేపైనా ఆగిపొమ్మని...
తనను ఎంతలా ప్రార్థిస్తానో??

కానీ నా ఆవేదనని కాస్తైనా అర్థం చేసుకోని కాలం
గడియలని క్షణాల్లా హరించివేస్తూ..
ఎక్కడలేని హడావిడితో వడివడిగా పరిగెత్తుతుంది!
వీడలేక వీడలేక నిన్ను విడిచి వెళ్ళాల్సిన తరుణంలో..నా మనసు పడే వేదన తనకు వినిపించదా?

ఎంత చిత్రమైనది ఈ కాలం?
తన మాయాజాలం అర్థం కాక అసహాయంగా చూస్తున్న నన్ను ఊరడించడానికి
నీ ఙ్నాపకాల ప్రవాహంలో నన్ను ముంచెత్తుతుంది..
అందమైన నీ ఊహల జడిలో నన్ను ఎగరేస్తుంది..
ఈ సందడిలో నా మనసు కాలాన్నే మరిచేలా చేస్తుంది!
కానీ నిన్ను చేరుకునేంత వరకు మనిద్దరి మధ్య దూరం తనే అని..ప్రతి క్షణం గుర్తు చేస్తుంది!

తనకి తెలుసో లేదో?
మన మనసులు ఈ దూరాన్ని ఎప్పుడో చెరిపేసాయని...కాలాన్ని కూడా గెలిచేసాయని!!!

Friday, June 6, 2008

!!! ELEGANT VILLA !!!




నిస్సారమైన రోజులు...బిజీ బిజీ బతుకులు...

ఏదో మార్పు కోసం ఎదురుచూపులు...

చెన్నైకొచ్చిన కొత్తలో వారి జీవన ముఖ చిత్రం...

ఆ ఇల్లు మార్చేసింది వారందరి దైనందిన జీవితం!




చూసారా?? టీవీ లొ తెలుగు ఛానెల్స్ మార్చి మార్చి చూసే అతడిని...

అందరిని ముందుకు నడిపే నాయకుడతడు...
అన్నింటా ముందుండే ప్రతిభావంతుడు...
సినిమాలను తలదన్నే నిజ జీవితపు కథలెన్నో తెలిసిన ఔత్సాహికుడు...
అర్ధరాత్రి కలవరింతలతో అప్పుడప్పుడు జడిపిస్తాడు!!!

ఇంటి గేట్ దాటక ముందే పెద్ద పెట్టున నవ్వు వినిపించిందా??
రాంగోపాల్ వర్మ వీరాభిమాని అతడు...
వెంకటేష్ సినిమాల విమర్శకుడు అతడు....
గుండెలు పిండే ట్రాజెడి సీన్లో కూడ కామెడీ సృష్టించగల హాస్యాభిమాని అతడు!!


అందరి ప్రశ్నలకి బదులిస్తూ...ఎప్పుడూ నవ్వుతూ..

అప్పుడప్పుడు ఉడుక్కుంటున్న...ఆ అబ్బాయిని చూసారా???
అందరి చర్చల కు గమ్యం అతడు...
బాడీ బిల్డింగ్ జిం కార్యక్రమాలకి.. కేశ సంరక్షణా పథకాలకి ఆద్యుడు అతడు!!


టీవీలో చక చకా మారుతున్న ఇంగ్లీష్ చానెల్స్ కనిపించాయా?

హోరెత్తించే వెస్టర్న్ మ్యూజిక్ వినబడుతోందా??
పి.హెచ్ డి చేయని ఆంగ్ల పండితుడు అతడు...
వారాంతాల్లో గల్లీ క్రికెట్ నిర్వాహకుడు అతడు..
అందరికీ వింత పేర్లు ఆపాదించడం లో దిట్ట అతడు!!!

యండమూరి నవల కనపడిందా?
తిలక్, శ్రీ శ్రీ కవిత వినబడిందా??
భావుకతా పునాదులపై కవితా భవంతులు నిర్మించే భాషా ప్రేమికుడు అతడు..
ఈ కవితా రచయిత అతడు!!!

పదే పదే "2 మచ్, తెల్సా??" అనే మాట వినబడుతోందా??

అందరినీ అలరించే చిరంజీవి వీరాభిమాని అతడు..
డ్రెస్సింగ్ స్టైల్స్ లో అందరికీ మార్గదర్శకుడు అతడు!!


అర్ధరాత్రి అయ్యాక టీ కి వెళ్దామనే ఆహ్వానం అందిందా?

అందరికీ అన్న పెద్దన్న అతడు..
"శరవణ భవన్" బ్రాండ్ అంబాసిడర్ అతడు...
పంక్చువాలిటీలో సాటి లేరు అతని కెవ్వరూ!!


గోవాలో గుభాళించిన తెలుగు పరిమళం అతడు...

చీమ చిటుక్కుమన్నా నిద్ర లేచే అప్రమత్తుడు..
ఆ ఇంటి కిచెన్ రూప కర్త అతడు!!

కొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన యువకులు వాళ్ళిద్దరూ...

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన యువ కిషోరాలు...
కష్టంగా ఉన్నా తప్పనిసరై చెన్నైని ఇష్ట పడుతున్న ఆశావాదులు వాళ్ళు!!!


వీళ్ళందరి ఆనందపు సందడిలో మురిసిపోతూ...

వీళ్ళ నవ్వుల వెలుగుల్లో మెరిసి పోతూ...
వీళ్ళ మాటల ముచ్చట్లలో వెలిగిపోతూ...


ఒక అనంత చైతన్య వాహిని..... ELEGANT VILLA!!!!

......Dedicated to all my roomies of ELEGANT VILLA(CHENNAI)

వీడ్కోలు(చెన్నై/CTS)!!!


చెదిరిపోయిన కలలకు….

ఊహించని ఆశాభంగాలకు….

అందుకోలేకపోయిన అంచనాలకు….

చేరుకోలేకపోయిన గమ్యాలకు…

చేజారిపోయిన అవకాశాలకు….

ఊహలు, వాస్తవాల మధ్య తేడాని రుచి చూపించిన సంఘటనలకు….

నిరంతర పోరాట స్ఫూర్తిని రగిలించిన పరిస్థితులకు….

సాక్ష్యంగా నిలిచిన ఈ మజిలీని మనసారా ఆస్వాదించి….

అలుపెరుగని ఆశావాదంతో…. భవిష్యత్ పై కొండంత ఆశతో….

కొత్త అంచనాలు.. సరి కొత్త గమ్యాలతో….

మరో ప్రయాణానికి సిద్ధమవుతూ….

బరువెక్కిన హృదయం!

మూగబోయిన మనసు!!

ఒక భాధామయ వీడ్కోలు!!!