Friday, August 23, 2013

నిజం నీ భాధ్యత!!

పెన్ను, మైకు, కెమెరా..
ఇవి నీకు ఇచ్చింది
నిజాలు రాయడానికి..
నిజాలు వినిపించడానికి..
నిజాలు చూపించడానికి..

అంతే కానీ..
గాలిలో నుండి వార్తలు సృష్టిస్తూ గారడీలు చేయకు
రాజకీయ రంగు పులుముతూ ప్రతి వార్తతో రభస చేయకు
గతి తప్పిన చర్చలతో అందరిని గందరగోళంలోకి నెట్టకు
మితి మీరిన వ్యాఖ్యలతో మనుషులను రెచ్చగొట్టకు
మతి లేని వ్యంగ్యంతో మనసులను గాయపర్చకు
శృతి మించిన సృజనాత్మకతతో వార్తల్లో వినోదాన్ని నింపకు

నీకు చేతనైతే,
చరిత్రలో మరుగునపడ్డ నిజాలని ప్రచురించు.
జనాన్ని చైతన్యవంతులని చేసే నిజాలని వినిపించు.
బతుకులని మార్చే నిజాలని చూపించు.

నీకు నిజాయితీ ఉంటే జనం నుండి పుట్టిన ఉద్యమాలకి నీ వంతు చేయూతనందించు!
పెట్టుబడిదార్ల పెత్తనం కోసం పుడుతున్న ఉద్యమాలను జనంపైకి నెట్టకు!!

Sunday, August 18, 2013

ఏందన్నా ఇది??


ఏందన్నా ఇది??
నువ్వు చరిత్ర తెలుసుకోకపోతివి
నేంజెప్తే ఇనకపోతివి
చెప్పిందే చెప్తా ఉంటివి
అరిగిపోయిన ఐకమత్యపు పాటే మల్ల మల్ల పాడుతుంటివి.

ఇష్టం లేకున్నా కలిపిండ్లన్నా అని నేనంటే
మేమే నిన్ను పైకి తీస్కచ్చినమని నువ్వంటివి.

పెద్దమనుషుల ఒప్పందం పక్కకు  పెట్టిండ్లన్నా అని నేను మొత్తుకుంటే
మాకు పెద్ద మనసు లేకనే ఇడగొడుతున్నమని నువ్వంటివి.

ఉపముఖ్యమంత్రి అనేది ఉత్తుత్తి మాట లెక్క చేసిండ్లన్నా అని నేనంటే
మా నాయకులు చేతగానోల్లని నువ్వంటివి.

కలిపినప్పుడు అనుకున్న ఆరు సూత్రాలను అంగట్ల అమ్మేశిండ్లన్నా అని నేనంటే
గా ముచ్చటే సమజ్ జేస్కోకుండా హైదరాబాద్ పై హక్కుల గురించి నువ్ మాట్లాడుతుంటివి.

మా నౌకర్ల మాకు కాకుండా జేసిండ్లన్నా అని నేనంటే
సర్కారు కొలువుల లెక్కలు చిక్కులు అర్థం జేస్కోకుండా
ఎవలు సదువుకుంటే వాల్లకే నౌకర్లస్తయని సొక్కంపూస లెక్క జెప్తుంటివి.

ముల్కి నిబందనలు మట్టిల కలిపిండ్లన్నా అని నేనంటే
ఆ మతలబు ఏందో అడుగకుండా ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నానని నువ్వంటివి.

తెలంగాణ నిధుల పైసలు తెల్వకుండా పట్టుకపోతుండ్లన్నా అని నేనొర్రుతుంటే
ఇనిపించుకోకుండా కలసి ఉంటే కలదు సుఖం అని చిలక పలుకులు పలుకుతింటివి.

దేశమంతా మాట్లాడుకునే ఎన్నో ఏండ్ల హైదరాబాద్ చరిత్ర గురించి నేంజెప్తుంటే
రియల్ ఎస్టేట్లు, కార్పొరేట్ దందాలే హైదరాబాద్ అభివృధ్ధి అన్నట్లు నువ్ జెప్తుంటివి.

మా చరిత్ర గురించి భాష గురించి ఎక్కడ జెప్పకుండా
మాది సక్కటి భాష కాదని మాకే అనిపించేటట్లు సదువులు మార్చేసిండ్లన్నా అని నేనంటే
వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అంటూ అసలు విషయం పక్కన బెడితివి.

నువ్ తెలంగాణ చరిత్ర తెలుసుకోకపొతివి..
సాయుధ పోరాటం గురించి సదవకపోతివి..
చరిత్ర కాయితంపై తెలంగాణ అమరవీరుల రక్తపు సంతకాలు సూడకపోతివి..
సమైక్యత ఇకమత్యం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటివి..
సందు దొరికితే మమ్మల్ని ఆగం జేద్దామని సూత్తాంటివి..

గందుకే అన్నా.. గుండె మండి జెప్తున్నా..
నిజాలు మాట్లాడితే ఇనేటోడు,
అన్యాయాల్ని అర్థం జేస్కునేటోడు,
అందరి చరిత్రని,సంప్రదాయాల్ని పట్టించుకునేటోడు
ఏ ఊరోడైనా నావోడే..

నా ఉనికిని గుర్తించనోడు,
నా బతుకుని పట్టించుకోనోడు,
నిజమైన ఉద్యమాన్ని గౌరవించనోడు,
నా పక్కనోడిగా ఉన్నా ఒకటే!
పక్క రాష్త్రంల ఉన్నా ఒకటే!!