Wednesday, October 24, 2012

బతుకమ్మ

పచ్చపచ్చని బంతిపూలు...
అప్పుడప్పుడే విరుస్తున్న తంగేడు పూలు...
రంగులద్దుకుని అన్ని రంగుల పూలతో పోటీ పడుతున్న గునుగు పూలు...
బతుకమ్మ ఒడిలో అందంగా ఒదిగిపోయాయి.

ఏడాదికోసారి వచ్చే ఊరేగింపులో అవకాశం దొరికినందని కాబోలు..
వయ్యారాన్ని ఒలకబోస్తున్నాయి..
తెలంగాణ ఆడపడుచుల పాటల్లో పరవశించిపోతున్నాయి.

"బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారి గౌరమ్మ ఉయ్యాల"!!

Tuesday, September 4, 2012

అలుపెరుగని సైనికులు

ఎప్పటిలాగే నా సాఫ్ట్ వేర్ ఉద్యోగ సమరానికి సన్నధ్ధమై
ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని చేధించుకుంటూ వెళ్తుంటే..

నేనొక్కడినే అనుకున్నాను..
దారంతా యుధ్ధాలే.. అందరు సైనికులే..

వరద గోదారిలా రహదారిని ముంచెత్తుతున్న వాహన ప్రవాహాన్ని ఎంతో చాకచక్యంగా
నియంత్రిస్తూ కాలుష్య కదన రంగంలో కలబడుతున్న ట్రాఫిక్ పోలీస్ సైన్యం..(Domlur fly over)

భుజానికి లాప్ టాప్ బ్యాగు, చెవిలో ఐపాడ్ లతో నడుస్తూ
క్లైంట్లు, మేనేజర్లతో కుస్తీకి సిధ్ధమవుతున్న సహోదర సాఫ్ట్ వేర్ సైన్యం..(EGL)

ఆఫీస్ హడావిడిలో ఉన్న అమ్మ నాన్నలకి టాటా చెప్పి విద్యాభ్యాస యుధ్ధానికై
పాఠశాల ప్రాంగణంలోకి పరుగులు పెడుతున్న బాల సైన్యం..(ST Francis High Scool, Koramangla)

అప్పుడే రెక్కలొచ్చిన గువ్వపిల్లల్లా...రంగురంగుల సీతాకోకచిలుకల్లా..
ఆర్ట్స్, సైన్స్ వగైరా కోర్సుల అంతు చూడడానికి ఆర్భాటంగా వెళ్తున్న యువ సైన్యం..(Krupanithi College, Madiwala)

లారీల్లో వచ్చిన కూరగాయల గుట్టలని కిందికి దించుతూ
రోజువారీ వ్యాపారంతో బతుకు బండి లాగడానికి చెమటోడ్చుతున్న వర్తక సైన్యం..(Madiwala Market)

రయ్యిమంటూ దూసుకొస్తున్న బైకులు, కార్లని తప్పించుకుంటూ తమ గమ్యస్థానాన్ని
చేర్చే బస్సుల కోసం స్టాపుల్లో తిప్పలు పడుతున్న ప్రయాణిక సైన్యం... (Silk Board bus stop)

ఇలా వెళ్ళే దారంతా
అంతులేని యుధ్ధాలే!
అందరూ అలుపెరుగని సైనికులే!!

**నేను రోజు ఆఫీస్ కి వెళ్ళే దారిలో(Kodihalli To JP Nagar via Domlur, Koramangla, Madiwala, SilkBoard) గమనించిన విషయాలకు చిన్న కవితా రూపం 

Thursday, March 22, 2012

నందననామ సంవత్సరమా!!


ప్రియమైన నందన నామ సంవత్సరమా...
అప్పుడే వచ్చేసావా??
ఖరనామ సంవత్సరం నీకు చెప్పిందో లేదో తన అనుభవాలు, అనుభూతులు...

ఎప్పటిలాగే గుర్తుపట్టలేనంత వేగంగా రాజకీయాల్లో రంగులు మారిపోతున్నాయి..
కుంభకోణాలకి కొత్త నిర్వచనాలనిచ్చే పనిలో తలమునకలైపోయారు మా నాయకులు...

ప్రతి చిన్న వార్తకి పడుతూ లేస్తూ కంగారు పెడుతున్నది సెన్సెక్స్ సూచీ..
మొన్ననే విడుదలైన బడ్జెట్ లో అంకెల గారడీ అర్థం కాక, లాభ నష్టాలు
బేరీజు వేసుకుంటున్నాడు మధ్యతరగతి మానవుడు..

ప్రపంచ కప్ గెలిచిన సంబరం ఎప్పుడో ఆవిరైపోయింది...
ఎవరెవరు ఎప్పుడు రిటైర్ కావాలో నిర్ధారించే పనిలో నిమగ్నమైపోయాడు సగటు క్రీఢాభిమాని..
ఇంకా మూడు ఫైట్లు, ఆరు పాటల సినిమాలతో
ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు కొందరు దర్శకులు..

ప్రతిరోజు పేపర్ లో వార్తలు చదివినప్పుడల్లా కాస్త నిట్టూర్చి, కొంత చర్చించి
తర్వాత అన్నీ మర్చిపోయి తమ పనుల్లో మునిగిపోతున్నారు కొందరు...
మార్పు కావాలంటే ఏదో ప్రయత్నం అవసరమని
తమవంతు కృషి చేస్తున్నారు ఇంకొందరు...

ఇవన్నీ విని కంగారుపడకు...మాకెప్పుడో అలవాటైపోయాయి..
తొందరలోనే నీక్కూడా అలవాటైపోతాయిలే...

గుమ్మంలో నిలబెట్టి మాట్లాడానని నాపై కోపగించుకోకు..
ఇప్పుడే ఖరనామ సంవత్సరం మిగిల్చిన ఙ్నాపకాలని పదిలంగా మనసు అరల్లో భద్రపరిచాం..
ఇంకెందుకు ఆలస్యం??
రాబోతున్న సంవత్సరపు దారిలో కుమ్మరించు నువ్వు తెచ్చిన కొత్త అనుభవాల మూటని..
కొంగొత్త అశలతో మరో సంవత్సరం ఆస్వాదించడానికి ఎప్పుడో సిద్ధమయ్యాం మేమందరం..