తమ్మీ.. తెలంగాణ తెగ్గొట్టుడంటే మనకు తెగదెంపులన్నట్టు కాదే.. కొన్ని కొత్త గీతలు గీయడం.. లెక్కలు సక్కగా జేయడం.. ఎవలకు రావాల్సింది వాళ్ళకియ్యడం.. ఎవల బతుకు వాళ్ళను బతకనియ్యడం..
హైదరాబాదు నీ గీత అవతలకి పోతదంటే గింత లొల్లి దేనికే? హైటెక్ సిటీల కంపెనీలు మూతబడతయా? కుకట్ పల్లిల అపార్టుమెంట్లు కూలిపోతయా?? చార్మినార్ ఎక్కనియ్యరా? గోల్కొండ సూడనియ్యరా? టాంక్ బండ్ మీద నడువనియ్యరా??
పాత జాగల కొత్త గీతలు గీస్తే పాత మనిషివి పరాయోడివైపోతవా? గిన్ని దినాలు నీ గీతలనే కూసున్నవా? బతుకు దెరువు కోసం బయటికొస్తలేవా?
సాఫ్టువేరు నౌకరస్తె బెంగుళూరు పోతలేవా? బిజినెస్ జేయడానికి బొంబాయి పోతలేవా? సదువుల కోసం దేశాలు దాటి పోతలేవా? కొలువుల కోసం ఖండాలు దాటి పోతలేవా?? గిన్నింటికి అడ్డం రాని గీతలు గిప్పుడే నిన్ను ఆపుతయా??
కూసొని మాట్లాడుకుంటే తెగిపోయే లెక్కల కాడ కొత్త కిరికిరి పెట్టకు.. ఎవలది వాళ్ళకి పంచే కాడ నువ్వడిగిందే కావాలని మారాం జెయ్యకు..