Monday, March 28, 2011

జ్ఞాపకాలు!!!


జ్ఞాపకాలు... మళ్ళీ మళ్ళీ అవే జ్ఞాపకాలు...
ఎంతమంది మధ్యలో ఉన్నా నన్ను ఒంటరిని చేసే నీ జ్ఞాపకాలు....

స్నేహితులతో కలిసి సముద్ర తీరాన కూర్చున్నాను...
"చెన్నై మెరీనా తీరంలో నా అడుగుల్లో అడుగులు వేస్తూ,
నువ్వు నా వెనకే నడిచిన జ్ఞాపకం"...
బలంగా వచ్చి తాకిన అల నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు అలలతో ఆడుతున్నారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!

సాయంత్రం పూట గుడికి వెళ్ళాను...
"ఒకరోజు గుడిలో చేతిలో చెయ్యేసి ఇద్దరం కలిసి గంట కొడుతుంటే,
అక్కడున్న పిల్లలు మనల్ని ఆసక్తిగా చూసిన జ్ఞాపకం".....
గట్టిగా మోగిన గుడి గంట నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు భక్తి పారవశ్యం లో మునిగిపోయి ఉన్నారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!!

వర్షంలో తడుస్తూ ఇంటికి వెళ్తున్నాను...
"ఒకరోజు వర్షంలో నేను చేసిచ్చిన కాగితపు పడవని నీళ్ళల్లో వదిలి
నువ్వు నా వైపు మెచ్చుకోలుగా చూసి నవ్విన జ్ఞాపకం".....
ఎక్కడో దూరంగా ఉరిమిన శబ్దం నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు గొడుగులతో హడావిడిగా నడుస్తున్నారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!!

బస్ స్టాప్ లో నిలబడి వేచి చూస్తున్నాను...
"ఒకరోజు రన్నింగ్ బస్ నుండి దిగినందుకు,
నువ్వు నాకు ఆగకుండా చీవాట్లు పెట్టిన జ్ఞాపకం".....
గట్టిగా వినిపించిన బస్ హారన్ నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు బస్ దగ్గర క్యూ కట్టారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!!

ఆఫీస్ లో కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసుకుంటున్నాను...
"ఒకరోజు అంతా నిశ్శబ్దంగా ఉన్న ఆఫీస్ లో,
'అంతేనా?' అంటూ అందరికీ బొమ్మరిల్లు రింగ్ టోన్ వినిపించిన నీ ఫోన్ కాల్ జ్ఞాపకం".....
చెవులు చిల్లులు పడేలా మోగిన ఆఫీస్ ఫోన్ నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు పనిలో మునిగిపోయి ఉన్నారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!!

సినిమా హాలులో కూర్చుని ఉన్నాను..
"మొదటి సారి 3D సినిమా చూస్తూ నువ్వు గాల్లో చేతులు పెట్టి,
ఏదో అందుకోవాలని ప్రయత్నిస్తూ చిన్నపిల్లలా ఆనందించిన జ్ఞాపకం".....
DTS లో గట్టిగా వినిపించిన శబ్దం నన్ను ఈ లోకం లో పడేసింది.
మిగతా వాళ్ళందరు సినిమాలో లీనమై ఉన్నారు.
అందరి మధ్య ఒంటరిగా మిగిలిపోయాను!!!

ఈ సారి నీ పుట్టిన రోజుకి అందరికన్నా ముందుగా శుభాకాంక్షలు చెప్పాలని
ఆతృతగా నీ నంబర్ కి డయల్ చేస్తున్నాను....
"ఒకసారి నీ పుట్టినరోజుకి ' అందరి కన్నా ముందు నువ్వే నాకు విషెస్ చెప్పాలి,
అంతవరకు నేను ఎవరితో మాట్లాడను ' అని నువ్వు ఆజ్ఞాపించిన జ్ఞాపకం".....
"The subscriber you are trying to reach is currently not answering your call. Please try after some time"
అని వినిపించిన మెసేజ్ నన్ను ఈ లోకం లో పడేసింది.
నేనొక్కడినే ఒంటరిగా మిగిలిపోయాను!!!

నా ఒంటరితనాన్ని చూసి ఒక్కసారిగా మళ్ళీ
రెక్కలు కట్టుకుని వచ్చి నన్ను చుట్టు ముట్టాయి జ్ఞాపకాలు...
ఇప్పుడు అవే నాకు ఆప్తమిత్రులు...
అవి నన్ను ఓదార్చుతున్నాయో... లేక వేధిస్తున్నాయో...
తెలియకుండానే బలపడిపోయింది మా స్నేహం...

ఎప్పటికైనా ఈ జ్ఞాపకాలని నీతో కలసి పంచుకుంటానా?
లేక ఈ జ్ఞాపకాలతో నేనొక్కడినే ఒంటరిగా మిగిలిపోతానా?

Saturday, February 19, 2011

బ్రహ్మచారి డైరీ


ఆఫీసుకి వెళ్ళే ముందు అమ్మకి ఫోన్ చేసా...
"మన పెద్దత్తమ్మ కొడుకు పెళ్ళికి వెళ్తున్నాం రా...వచ్చాక మాట్లాడతా.."
ఏదో హడావిడిలో అమ్మ!!

ఫోన్ పెట్టి ఆఫీస్ బ్యాగ్ సర్దుకుంటుంటే...
"Rakesh weds Sridevi" కొలీగ్ నిన్న ఇచ్చిన పెళ్ళి పత్రిక!!

ఆఫీస్ కి వెళ్ళి సీట్లో కూర్చున్నా.. ఎప్పటిలాగే మేనేజర్ క్యాబిన్ వైపు చూసా..
"ఏంటి? మన పెళ్ళి కాని మేనేజర్ సీట్లో లేడేంటి"? నాలో ఆశ్చర్యంతో కూడిన ఆనందం.
"నీకు తెలియదా? పెళ్ళి చూపులట. ఈ రోజు సెలవు" కొలీగ్ సమాధానం.

ఈ రోజుకి వీడి నస తప్పిందని ఆనందం ఒక వైపు..
ఈ పెళ్ళి కుదిరితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటా అని జాలి ఇంకో వైపు..

కంప్యూటర్ ఆన్ చేసాను.
"Please come and have sweets at my desk. I got engaged."
కొలీగ్ నుంచి ఒక మెయిల్.. దానికి ఒక 20 రిప్లైలు...

అక్కడికి వెళ్ళి స్వీట్ తీసుకుని నోట్లో పెట్టుకోగానే, ఎదురుగా ప్రాజెక్ట్ మేనేజర్...
"As you know Rakesh is on marriage leave. You need to complete his assignment also. Thanks for your support." అని చెప్పి నా సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు..
ఒక్కసారిగా నోట్లో ఉన్న స్వీట్ చేదుగా అయిపోయింది..

నానా తంటాలు పడి, పని పూర్తి చేసుకుని బయట పడ్డాను.
సాయంత్రం ఇంజనీరింగ్ మిత్ర బృందం conference call.
"పెళ్ళికి ఇంకా లేట్ చేస్తే ఎవరూ పిల్లనివ్వరని భయపెడ్తున్నాడ్రా మా నాన్న" ఒకడి గొంతులో కంగారు...
"చెల్లెలు ఉండటంతో బతికిపోయా.. ఈ సంవత్సరానికి లైఫ్ బిందాస్" పద్మవ్యూహం నుంచి త్రుటిలో తప్పించుకున్న అభిమన్యుడి ఫోజులో ఇంకొకడు..
"అమ్మాయి సైడ్ నుంచి అంతా ఓకే రా.. ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలో అర్థం కావటం లేదు" 3 సంవత్సరాలనుంచి ప్రేమలో మునిగిపోతూ ఎప్పుడు పైకి తేలతాడో తెలియని ఇంకో మిత్రుడి ఆవేదన...
నా కష్టాల గురించి చెప్పి వీళ్ళని ఇంకా భయపెట్టటం ఎందుకని అందరికి ధైర్యం చెప్పి నా రూం కి చేరుకున్నాను.

"Internet లొ వెతికితే మనకు నచ్చే అమ్మాయిలు దొరుకుతారా మాష్టారు?" laptop లో telugumatrimony.com, bharathmatrimony.com, jeevansathi.com సైట్లని 3 tabs లో మార్చి మార్చి చూస్తున్న మా రూం మేట్ సందేహం...
"అయినా అబ్బాయికి పెళ్ళి కుదరాలంటే ఆస్తిపాస్తులు,అందచందాలు ఉండగానే సరిపోదు" రాలి పోతున్న జుట్టు వైపు జాలిగా చూస్తూ ఇంకొకడి వైరాగ్యం
"వచ్చే వారమే మా అవిడని తీసుకొస్తున్నా. చాలా వస్తువులు కొనాలి. ఎవరైనా వస్తారా నాతో ?" ఇంజినీరింగ్ ఎంట్రన్స్ కి ప్రిపేర్ అవుతున్న ఇంటర్మీడియట్ విధ్యార్థిలా కంగారుతో కొత్తగా పెళ్ళైన ఇంకొక రూం మేట్..

"పెళ్ళి అనే రెండు అక్షరాల పదం ప్రపంచాన్ని ఇంతగా కుదిపేస్తోందా?" అనుకుంటూ కాసేపైనా దూరంగా పారిపోవాలి అని నా రూం లోకి వెళ్ళి విశ్రమించాను.

"పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు... తప్పెట్లు తాళాలు....తలంబ్రాలు....
మూడే ముళ్ళు...ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్ళు" అంటూ ఎదురింట్లో నుంచి పెద్ద వాల్యూం తో నా కోసమే అన్నట్లుగా వినిపిస్తున్న పాట.

"భగవంతుడా! 3 ముళ్ళు.. 7 అడుగులు.. 100 సంవత్సరాలు..
3,7,100...ఈ సిరీస్ లో తరవాత నంబర్ ఏంటి? అసలు దీంట్లో లాజిక్ ఏంటి?
ఈ ప్రశ్నలతో నా బుర్ర వేడెక్కింది.

"వద్దు రా సోదరా.. పెళ్లంటే నూరేళ్ళ మంటరా ..
ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా" పాట ని అంతకన్నా ఎక్కువ వాల్యుంతో ప్లే చేస్తూ నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ నిద్రకి ఉపక్రమించాను.

"పెళ్ళి చేసుకుని, ఇళ్ళు చూసుకుని చల్లగా కాలం గడపాలోయ్..
ఎల్లరి సుఖము చూడాలోయ్.. మీరెల్లరు హాయిగ ఉండాలోయ్"
ఈ సారి మా రూం మేట్ నాకు పోటీగా నా కన్నా ఎక్కువ వాల్యుంతో ప్లే చేస్తున్నాడు.

తప్పదు ఈ బ్రహ్మచారిని పెళ్ళి భాధ నుంచి ఎవరు తప్పించలేరు....
ఎప్పటికైనా ఈ పెళ్ళికి లొంగిపోవాల్సిందే అనుకుంటూ భారంగా నిట్టూర్చి మళ్ళీ పడుకున్నాను.