Thursday, March 22, 2012

నందననామ సంవత్సరమా!!


ప్రియమైన నందన నామ సంవత్సరమా...
అప్పుడే వచ్చేసావా??
ఖరనామ సంవత్సరం నీకు చెప్పిందో లేదో తన అనుభవాలు, అనుభూతులు...

ఎప్పటిలాగే గుర్తుపట్టలేనంత వేగంగా రాజకీయాల్లో రంగులు మారిపోతున్నాయి..
కుంభకోణాలకి కొత్త నిర్వచనాలనిచ్చే పనిలో తలమునకలైపోయారు మా నాయకులు...

ప్రతి చిన్న వార్తకి పడుతూ లేస్తూ కంగారు పెడుతున్నది సెన్సెక్స్ సూచీ..
మొన్ననే విడుదలైన బడ్జెట్ లో అంకెల గారడీ అర్థం కాక, లాభ నష్టాలు
బేరీజు వేసుకుంటున్నాడు మధ్యతరగతి మానవుడు..

ప్రపంచ కప్ గెలిచిన సంబరం ఎప్పుడో ఆవిరైపోయింది...
ఎవరెవరు ఎప్పుడు రిటైర్ కావాలో నిర్ధారించే పనిలో నిమగ్నమైపోయాడు సగటు క్రీఢాభిమాని..
ఇంకా మూడు ఫైట్లు, ఆరు పాటల సినిమాలతో
ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు కొందరు దర్శకులు..

ప్రతిరోజు పేపర్ లో వార్తలు చదివినప్పుడల్లా కాస్త నిట్టూర్చి, కొంత చర్చించి
తర్వాత అన్నీ మర్చిపోయి తమ పనుల్లో మునిగిపోతున్నారు కొందరు...
మార్పు కావాలంటే ఏదో ప్రయత్నం అవసరమని
తమవంతు కృషి చేస్తున్నారు ఇంకొందరు...

ఇవన్నీ విని కంగారుపడకు...మాకెప్పుడో అలవాటైపోయాయి..
తొందరలోనే నీక్కూడా అలవాటైపోతాయిలే...

గుమ్మంలో నిలబెట్టి మాట్లాడానని నాపై కోపగించుకోకు..
ఇప్పుడే ఖరనామ సంవత్సరం మిగిల్చిన ఙ్నాపకాలని పదిలంగా మనసు అరల్లో భద్రపరిచాం..
ఇంకెందుకు ఆలస్యం??
రాబోతున్న సంవత్సరపు దారిలో కుమ్మరించు నువ్వు తెచ్చిన కొత్త అనుభవాల మూటని..
కొంగొత్త అశలతో మరో సంవత్సరం ఆస్వాదించడానికి ఎప్పుడో సిద్ధమయ్యాం మేమందరం..

1 comment: