Sunday, May 20, 2018

చైతన్య పాఠశాల

పరకాల పుర వీధులు..
చైతన్య పాఠశాల తరగతి గదులు..

పాఠశాల జీవితపు హరివిల్లులో అన్ని రంగులని చూపిన ఉపాధ్యాయులు వారు..

మనసుకు హత్తుకున్న నిర్మల మనస్కులు కొందరు..
మనసారా నవ్వించిన అపర విదూషకులు ఇంకొందరు..

దెబ్బలతో హడలెత్తించిన చండశాసనులు కొందరు..
చెప్పిన చదువుకే అందం తెచ్చిన నేర్పరులు ఇంకొందరు..

చదువుల రంగస్థలంలో నవరసాలు పండించిన విద్యార్థులు వారు..

మొత్తం చదువులో మునిగిపోయి ప్రపంచాన్ని గమనించని ఋషులు కొందరు..
రంగమేదైనా  రయ్యిమంటూ దూసుకెళ్లిన ప్రతిభావంతులు ఇంకొందరు..

రోజంతా నవ్వుల జల్లులు కురిపించిన అలుపెరుగని హాస్యప్రియులు కొందరు..
అమాయక వదనాలతో ఉంటూనే ఒక్కసారిగా హాస్య బాణాలని ఎక్కుపెట్టే చమత్కారులు ఇంకొందరు..

కిలోమీటర్ల దూరాన్ని రోజుకి రెండు సార్లు చుట్టేసిన  నడక వీరులు కొందరు..
ఊళ్ళకి ఊళ్ళు దాటేసిన సైకిల్ యోధులు ఇంకొందరు..

మల్లయోధులని మరిపించిన గట్టి ఆకారాలు కొందరు..
వయసుకి సంబంధం లేని చిట్టి ఆకారాలు ఇంకొందరు..

తెలుపు చొక్కాలు కాషాయ నిక్కర్లతో
భావి జీవితానికి పునాదులు వేసుకున్న చిన్నారి సైనికులు వారు..

ఎన్ని వ్యక్తిత్వాలు..
ఎన్ని అనుభవాలు..
ఎన్ని ఆశలు..
ఎన్ని కలలు..
ఎన్ని జ్ఞాపకాలు..
ఎప్పటికి తిరిగిరాని మధురమైన ఆ రోజులు..

చైతన్య పాఠశాలకి అంకితం!!

No comments: