చిరునవ్వుల చుక్కలు కలిపి....
చిలిపితనపు రంగులు అద్ది...
నా మనసు వాకిట వెలసిన ముత్యాల ముగ్గు !!!
తొలి చూపుల పునాదులపై...
చెలి ఊహల సోపానాలతో...
నా హృదయ ప్రాంగణంలో నిలిచిన ప్రేమ సౌధం!!!
వలపు ఆకాశంలో...
తలపుల మేఘాలు ఢీకొని...
కురిసింది ప్రేమ జల్లు...
తడిసాయి రెండు మనసులు...
విరిసింది రెండు హృదయాలను కలిపే హరివిల్లు!!!
భాషకు భావుకతని అరువిచ్చే భావాలెన్నో..
నీ చూపుల్లో ఉండగా....
నిన్ను చూస్తూ నేను పలికే ప్రతి మాట ఓ కవితే కదా!!!
నీతో కలిసి ఉన్న వేళ...
ఆకలేమో "ఇప్పుడు నేనెందుకు గుర్తొస్తాను నీకు?"
అని అలిగి వెళ్ళిపోయింది...
నిద్రేమో "ఇంక నా అవసరం ఏముందిలే నీకు?"
అని అసూయతో జారుకుంది...
నిన్నే తనలో నింపుకున్న నా మనసేమో ..
వాటిని చూసి విజయ గర్వంతో చిరునవ్వు నవ్వింది!!!
కలలను ప్రేమిస్తున్నాను..
జీవితపు అందాలను చూపిస్తున్నందుకు...
కన్నీళ్ళను కూడా ప్రేమిస్తున్నాను..
జీవితపు లోతుల్ని పరిచయం చేస్తున్నందుకు...
మన ప్రతి ఎడబాటు..
రెండు కలయికల మధ్య వారధి..
ఈ వారధిని ఎప్పుడెప్పుడు దాటేద్దామా..
అని ఆరాటపడే నా మది!!!
ఆకాశంలోకి చూసి చందమామ ఎక్కడని అడిగితే...
చుక్కలు నాతో చెప్పిన రహస్యం!!
అలకలోను అందంగా ఉండే నీ మోముని దొంగచాటుగా చూడాలని..
ఆ చిలిపి చంద్రుడు,వెన్నెల తేకుండా నిన్ను ఉడికిస్తూ..
మబ్బుల చాటున దాగాడంట!!!
Friday, December 14, 2007
Subscribe to:
Post Comments (Atom)

1 comments:
caalaa baagumdamdi.
Post a Comment