Wednesday, August 22, 2007

ఉగాదికి స్వాగతం!

ఒంటరిగా కూర్చొని ఉన్న నన్ను ఉగాది కాస్త ముందుగానే పలకరించింది...
దిగులు పడుతున్న నన్ను చూసి విషయం ఏంటని అడిగింది...

అంతా చెప్పాను నేస్తం...
నీ సమస్యలు.. నా సమస్యలు.. మనందరి సమస్యలు...
మన భాధలు.. బాదరబందీలు, భావావేశాలు....
అన్నిటిని విడమరిచి చెప్పాను నేస్తం!

ఆశయాల సాధనలో అయిన వాళ్ళందరికి దూరంగా
అహర్నిశలు శ్రమిస్తున్న ఒక మిత్రుడి గురించి చెప్పా!

ప్రతికూల పరిస్థితుల వలయం లో చిక్కుకొని
ఒక క్షణం అసహాయతతో ఢీలా పడుతూ..
మరు క్షణం అశావాదంతో ముందడుగు వేస్తూ..
నిరంతరం పోరాడుతున్న ఒక యువకుడి వ్యథ వినిపించా!

జీవితాన్ని కబళించి వేస్తున్న యాంత్రికత నుంచి
తన భావుకతని కాపాడుకోవడానికై
తాపత్రయపడుతున్నఒక భావుకుడి గురించి చెప్పా!

ఆశలు, ఆశయాల మధ్య జరుగుతున్న
అంతులేని సమరంలో సమిధగా మారుతున్న
ఒక మధ్య తరగతి విధ్యార్థి గురించి చెప్పా!

చదువులో అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది
పట్టభద్రుడైన ఒక అబ్బాయి...
ప్రేమ పరీక్షలో విఫలమై విలవిలలాడుతున్న వైనం వివరించా!

కట్టుబాట్లను కాదనలేక.. కావాల్సిన వాడిని ఎంచుకోలేక..
రాబోయేవాడు తన కలల రాకుమారుడేనా కాదా ?
అని కలవరపడుతున్న ఒక కన్నెపిల్ల కథ చెప్పా!

వ్యక్తిగత స్వేఛ్ఛని హరించి వేస్తున్న సంప్రదాయాలు..
ఉద్యోగ జీవితంలోని సవాళ్ళతో..
సతమతమైపోతున్నఈ తరం అమ్మాయి ఆవేదన నినదించా!

భాధపడకు నేస్తం!!
"మనలోని నిర్వేదపు చీకట్లను ప్రారద్రోలుతానని...
మన మనసుల్ని నవ చైతన్యంతో నింపుతానని...
జీవితంపై ఆసక్తిని...
భవిష్యత్తు పై ఆశని తనతో మోసుకొస్తానని అంటూ..
మన కలలు నిజం కావాలని కోరుకుంటూ..
మరి కొద్ది రోజుల్లో మన ముందుకొస్తానని చెప్పింది ఉగాది"

ఇదే నేస్తం...
రాక ముందే ఉగాది నాకు చెప్పిన రహస్యం...
మర్చిపోకుండా పలుకుతావు కదా తనకి స్వాగతం....

ఉగాది శుభాకాంక్షలతో!!!

No comments: